కరోనా కారణంగా చిత్రసీమ అస్తవ్యస్థమైంది. బడ్జెట్లు తగ్గాలి.. పారితోషికాలు తగ్గాలి.. అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. అయితే.. మన కథానాయికలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు. కొంతమంది కథానాయికలు కరోనా సమయంలోనే పారితోషికాలు పెంచేస్తున్నారు. సమంత కూడా ఈ జాబితాలో ఉంది.తాజాగా ఆమె పారితోషిక దాదాపుగా డబుల్ చేసేసింది. ఇప్పుడు ఆమె పారితోషికం 3.5 కోట్లు అని టాక్. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ పాత్రలవైపు దృష్టి మరల్చింది సమంత. ఓ బేబీ లాంటి సూపర్ హిట్ ఆమె ఖాతాలో పడింది. దాంతో... సమంత పారితోషికానికి రెక్కలొచ్చాయి.
ఓ బేబీ వరకూ సమంత పారితోషికం 1.5 కోట్లే. మహా అయితే 2 కోట్లు. ఇప్పుడు ఏకంగా 3.5 కోట్లు అడగడంతో నిర్మాతలు అవాక్కవుతున్నారు. ఇటీవల ఓ నిర్మాత లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టుతో సమంతని సంప్రదిస్తే.. 3.5 కోట్ల పారితోషికం అడిగిందట. ఒకవేళ ఇదే నిజమైతే.. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయిక సమంతనే అవుతుంది. మరి సమంత అడిగినంత ఇచ్చే ధైర్యం నిర్మాతలు చేస్తారా, లేదా? అన్నది చూడాలి.