తమిళ తంబీలతో వ్యవహారం మహా సున్నితం. వాళ్ల ప్రేమనీ తట్టుకోలేం. కోపాన్నీ భరించలేం. రెండింటిలోనూ వాళ్లు కాస్త అతి చేస్తారు. ఇప్పుడు సమంతపై మాత్రం భగ్గుంంటున్నారు. `మా చరిత్రని వక్రీకరించే వాళ్లతో చేతులు కలుపుతావా` అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దానికి కారణం... `ది ఫ్యామిలీ మెన్ 2` వెబ్ సిరీస్. ఇందులో సమంత ఓ కీలకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ కూడా విడుదలైంది. అందులో సమంత ఆత్మాహుతి దళ సభ్యురాలి పాత్రలో కనిపించనుంది.
ఈ ట్రైలర్ సమంత ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది. అయితే తమిళులకు మాత్రం నచ్చలేదు. ఇది ఎల్టీటీఈ నేపథ్యంలో సాగే కథ అని, తమిళ చరిత్రని ఇందులో వక్రీకరిస్తున్నారని, అలాంటి వెబ్ సిరీస్‌లో ఎలా నటిస్తావంటూ... సమంతని సోషల్ మీడియా సాక్షిగా నిలదీస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ని తాము బహిష్కరిస్తామని, విడుదలను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమంత ఇప్పటి వరకూ మౌనంగానే ఉంది. మరి ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి.