చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ముఠామేస్త్రి' సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సినిమా. అయితే ఇప్పుడు ఆ తరహా మాస్ సినిమాని చరణ్‌తో తెరకెక్కించాలని డైరెక్టర్ సంపత్ నంది ఉవ్విళ్లూరుతున్నాడట. గతంలో సంపత్ నంది - చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'రచ్చ' సినిమా మంచి విజయం అందుకుంది. ఆ టైంలోనే చరణ్‌తో మరో సినిమా చేయాలని మాట కూడా తీసుకున్నాడట సంపత్ నంది. అయితే ఆ తర్వాత ఈ కాంబినేషన్ పట్టాలెక్కేందుకు అవకాశాలు కుదరలేదు. కానీ తొందర్లోనే అందుకు అవకాశాలు కుదరాలని సంపత్ ఆశిస్తున్నాడట. చరణ్ కోసం స్క్రిప్టు ఎప్పుడో సిద్ధం చేసి పెట్టుకున్నాడట సంపత్ నంది. చరణ్ ఓకే అంటే చాలు సినిమా పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నాడట. అలాగే పవన్ కళ్యాణ్‌తోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట సంపత్ నంది. గతంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాని సంపత్‌నందే తెరకెక్కించాలి. కానీ లాస్ట్ మినిట్‌లో ఆ ప్రాజెక్టు సంపత్ చేయి జారిపోయింది. ఎప్పటికైనా పవన్‌తోనే ఓ సినిమా చేస్తానంటున్నాడు ఈ మాస్ మసాలా డైరెక్టర్. ప్రస్తుతం సంపత్ నంది 'గౌతమ్ నందా' సినిమాతో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోంది ఈ సినిమా. కేథరీన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సంపత్ మరో పక్క నిర్మాతగానూ బిజీగా ఉన్నాడు. 'పేపర్ బోయ్' పేరుతో సంపత్ నంది నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతోంది.