ప్రేమలో చనువు ఏ రేంజ్‌లో ఉండాలో అని సింపుల్‌గా తన స్టైల్‌లో చెబుతూ మాట్లాడిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తప్పు పడుతూ పలువురు నటీమణులు, మహిళా విలేఖర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో నటి సమంత, సింగర్ చిన్మయి, అనసూయ తదితరులున్నారు. ఈ విషయంపై తాజాగా సందీప్ రెడ్డి స్పందించారు.
దురదృష్టవశాత్తూ, తన వ్యాఖ్యలను మీడియా మిత్రులు తప్పుగా అర్ధం చేసుకుని ప్రచారం చేశారనీ, తన అర్ధం, యువతీ యువకులు ప్రేమించుకునేటప్పుడు అన్ని రకాల కోణాలూ బయటపడాలంటే, వారి మధ్య కొట్టుకునేంత, ముట్టుకునేంత చనువు ఉండాలనీ, అప్పుడే వారి మధ్య ఎమోషన్ వుంటుందనీ సందీప్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తానెవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని తన దృష్టిలో పురుషులూ, స్త్రీలూ ఇద్దరూ సమానమేనని ఆయన అన్నారు.
ఆయన తెరకెక్కించిన సినిమా 'అర్జున్‌రెడ్డి'లోని హీరో, హీరోయిన్ పాత్ర చిత్రీకరణను గుర్తు చేస్తూ ఇద్దరి పాత్రలకూ ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఇచ్చాననీ, ఇద్దరి పాత్రలూ స్ట్రాంగ్‌గా డిజైన్ చేశాననీ ఆయన అన్నారు. ఏ ఒక్కరినో ఎక్కువ చేసి, మరొకర్ని తక్కువ చేసి చూపించాలనే ఆలోచన తనకు లేదనీ అన్నారు సందీప్ రెడ్డి వంగా. ఇటీవల హిందీలో ఆయన తెరకెక్కించిన 'కబీర్‌సింగ్' సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే ఆయన నోటి నుండి జారిన కొన్ని మాటలు ఇలా వక్రీకరించబడ్డాయి.