కేజీఎఫ్ 2... సౌత్ ఇండియానే కాదు, బాలీవుడ్ కూడా ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కేజీఎఫ్ 1 సృష్టించిన సంచలనాలు అలాంటివి మరి. పైగా.. కేజీఎఫ్ తో పోలిస్తే... కేజీఎఫ్ 2లో స్టార్ బలం, బలగం ఎక్కువ. బడ్జెట్ కూడా ఎక్కువే. అందుకే... కేజీఎఫ్ 2 టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యింది. ఈ సినిమా నుంచి ఇప్పుడు అధిరగా సంజయ్ దత్ లుక్ బయటకు వచ్చింది. అధిర పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నాడు. ఈరోజు సంజయ్ దత్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా కేజీఎఫ్ టీమ్ సంజయ్ లుక్‌ని రివీల్ చేసింది. అధిర ఎంత క్రూరుడో.. ఈ లుక్‌లోనే చెప్పేసింది చిత్రబృందం. సంజయ్ రాకతో.. ఈ సినిమాకి కొత్త బలం వచ్చి చేరినట్టైంది. ఇది వరకే సంజయ్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే ఓ భారీ యాక్షన్ ఘట్టాన్నిరూపొందిస్తాడట. అందుకోసం కసరత్తులు జరుగుతున్నాయి. నిజానికి... సంజయ్‌దత్‌కి సంబంధించిన టీజర్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. కానీ..అనివార్య కారణాల వల్ల టీజర్ బయటకు రాలేదు. కేవలం లుక్‌తోనే సరిపెట్టాల్సివచ్చింది. 'ఇలాంటి ప్రాజెక్టులో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే మంచి పుట్టిన రోజు కానుకని నేను ఆశించలేను'' అంటూ.. ట్వీట్ చేశాడు సంజయ్ దత్.