సినీ పరిశ్రమ అంతా స్తబ్దుగా ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మ మాత్రం వరసపెట్టి సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈమధ్య 'పవర్ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన త్వరలో 'మర్డర్' అనే సినిమాను రెడీ చేస్తున్నారు. ఇవి కాకుండా రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుడుతున్నారని టాక్ వినిపిస్తోంది.
'అల్లు బావ బావమరిది' అనే టైటిల్ తో ప్రజారాజ్యం పార్టీ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇందులో కథ ప్రధానంగా చిరంజీవి, అల్లు అరవింద్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో అల్లు అరవింద్ తెరవెనుక కీలక పాత్ర పోషించారని అప్పట్లో ప్రచారం సాగింది. ప్రజారాజ్యం పార్టీ ఓటమికి అల్లు అరవింద్ కూడా కొంత వరకు కారణం ఉన్నది రాజకీయవర్గాలలో వినిపించిన గాసిప్. ఈ పరిణామాలన్నింటినీ ఈ సినిమాలో చూపిస్తారని టాక్ వినిపిస్తోంది.
'పవర్ స్టార్' సినిమాతో పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదు అంటూనే పవన్ కళ్యాణ్ జీవితంలో జరిగిన ఒక ఘట్టాన్ని చూపించారు ఆర్జీవి. ఇప్పుడు మరోసారి అల్లు అరవింద్ కీలకపాత్రలో మరో వివాదాస్పద చిత్రానికి రెడీ అవుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాను టేకప్ చేస్తున్నట్టుగా వర్మ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.