సంక్రాంతికి విడుదలయ్యేందుకు కొన్ని సినిమాలు సిద్ధమవుతున్న విషయం విదితమే. అన్‌లాక్ మార్గదర్శకాల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సినిమా హాళ్ళు తెరచుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. నవంబర్ 1 తర్వాత కొన్ని సినిమా హాళ్ళు తెరచుకోవచ్చు. దీపావళి సీజన్‌లో ఒకటీ అరా సినిమాలు విడుదలవ్వొచ్చు. మరోపక్క, సంక్రాంతి నాటికి కరోనా తీవ్రత బాగా తగ్గిపోయి, సినిమా హాళ్ళు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయన్న కోణంలో కొన్ని పెద్ద సినిమాలు సంక్రాంతి సీజన్‌పై ఆశపడుతున్నాయి. అదే సమయంలో, సెకెండ్ వేవ్ భయం సినీ పరిశ్రమను వెంటాడుతోంది.
సంక్రాంతికి రిలీజులు లాక్ చేసుకుంటే, ఆ సమయంలో మళ్ళీ సినిమా హాళ్ళపై ఆంక్షలు వస్తే ఏంటి పరిస్థితి.? అనేది చాలామంది భయం. ఈ నేపథ్యంలో సంక్రాంతి కంటే, సమ్మర్ సీజన్ వైపే చాలామంది సినీ నిర్మాతలు మొగ్గు చూపుతున్నారట. సంక్రాంతి సీజన్‌కైతే పెద్దగా ఇబ్బంది వుండదు. వారానికి ఓ పెద్ద సినిమా విడుదలైనా సమస్య వుండకపోవచ్చు. అదే సంక్రాంతి సీజన్‌ని నమ్ముకుంటే, ఏ చిన్న తేడా జరిగినా దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. ‘పరిస్థితిని అంచనా వేయడానికి సినిమా హాళ్ళు తెరుచుకున్నాక కూడా రెండు మూడు నెలలు అవసరం..’ అని ఓ సినీ ప్రముఖుడు అభిప్రాయపడుతున్నారు. అదీ నిజమే. ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా సినిమా హాళ్ళకు వచ్చినప్పుడే, పెద్ద రిలీజుల వల్ల సినీ పరిశ్రమకు కాస్తో కూస్తో లాభం వుంటుంది.