ఈ ఏడాది సంక్రాంతికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ మధ్య పోటా పోటీ పోరు జరగనుంది. రెండు సినిమాలూ ఒకే రోజు విడుదల కావడమే ఇందుకు కారణం. మామూలుగా సంక్రాంతి సీజన్ ఎన్ని సినిమాలనైనా తట్టుకుని నిలబడగలదు. కానీ, ఒకే రోజు ఇద్దరు స్టార్స్ తలపడడమంటేనే, ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య ఒకింత ఉత్కంఠ నెలకొంది. 'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్ ఇప్పటికే చించేస్తున్నారు. ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రావల్సిన బజ్ వచ్చేసింది ఇప్పటికే ఈ సినిమాపై. ఇప్పటి వరకూ జరిగిన 'అల..' ప్రమోషన్స్‌తో పోల్చితే, 'సరిలేరు..' నుండి ఆ రేంజ్‌లో ఒక్క గ్లింప్స్ కూడా వచ్చింది లేదు. ఇదిగో ప్రమోషన్స్, అదిగో ప్రమోషన్స్ అంటూ ఫ్యాన్స్‌ని ఊరిస్తున్నారు. ఇంతలా ఊరిస్తున్న 'సరిలేరు..' టీమ్, ఇక నుండి ఏం చేసినా, అంతకు మించి అనేలానే ఉండాలి.
నిజానికి సంక్రాంతి రిలీజ్ సినిమాలకు ఇప్పుడప్పుడే ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, 'అల..' టీమ్ చేస్తున్న హంగామా చూస్తుంటే, మహేష్ ఫ్యాన్స్ ఊరికే ఉండలేకపోతున్నారు. దాంతో మహేష్‌పై ఒత్తిడి పెరుగుతోందట. మూడు పాటలు మినహా దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. ఈ రెండు పాటల్ని కూడా కంప్లీట్ చేసి, ఇక ప్రమోషన్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టనున్నారట. ఇప్పటికే ఒక ప్రత్యేక టీమ్ 'సరిలేరు..' ప్రమోషన్ ప్లానింగ్స్‌ని ప్రిపేర్ చేస్తోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పని చేస్తున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఒక్కొక్కరిపై ఒక్కో స్పెషల్ వీడియోని విడుదల చేసి, సినిమాపై హైప్ పెంచాలనుకుంటున్నారట. చూడాలి మరి ఆ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో. ఎంత మేర వర్కవుట్ అవనుందో.!