'సర్కార్' సినిమా అసలు వసూళ్ళెంతన్నదానిపై గందరగోళం కొనసాగుతోంది. ఇంతలోనే 200 కోట్లకు చేరువయ్యిందంటూ ఓ హడావిడి షురూ అయ్యింది విజయ్ అభిమానుల నుంచి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్లు (గ్రాస్) ఈ సినిమాకి వచ్చాయట. మొత్తంగా అన్ని భాషల్లోనూ, విదేశాలతో కలుపుకుంటే 200 కోట్లకు దగ్గరగా వచ్చిందట 'సర్కార్'.
అంటే, రేపో మాపో 200 కోట్ల రూపాయల మార్క్ అందేసుకుందంటూ ప్రకటన రాబోతోందన్నమాట. సినిమా టాక్‌కి భిన్నంగా వసూళ్ళను సాధించిన మాట వాస్తవం. అయితే ఆ విజయాన్ని తక్కువ చేసేలా ఈ తరహా గందరగోళం లెక్కలుంటున్నాయంటూ ఈ మధ్య పలు సినిమాల విషయంలో సినీ అభిమానుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. పలు తెలుగు సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. 200 కోట్ల మార్క్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా, 'సర్కార్'లా నెగెటివ్ టాక్ వచ్చిన సినిమా ఇంత పెద్ద వసూళ్ళంటే ఏమాత్రం నమ్మదగ్గ విషయం కాదు.
మామూలుగా అయితే సినిమా బొక్క బోర్లా పడేది.. వచ్చిన రిజల్ట్ కారణంగా. సినిమాపై తలెత్తిన వివాదాలతో అనూహ్యంగా వసూళ్ళు పుంజుకున్నాయి. కేవలం తమిళనాడులోనే 'సర్కార్' 100 కోట్లు దాటేసిందని తాజాగా వెల్లడవుతున్న అభిమానుల లెక్కలతో తేలుతోంది. ఇది నిజమేనా.? నిజమని నమ్మాల్సి వస్తే, ఓ వారం పది రోజుల్లో ఈ 'సర్కార్'ని 300 కోట్ల క్లబ్‌లోకి కూడా చేర్చేస్తారేమో.