తమిళ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'సర్కార్' చుట్టూ ముసురుకున్న వివాదాల ఉచ్చు బిగుసుకోవడంతో దెబ్బకి సర్కార్ టీమ్ దిగి రాక తప్పలేదు. మొదట్లో ఏమాత్రం తగ్గేది లేదన్న సర్కార్ టీమ్ కాస్తా గవర్నమెంట్ దెబ్బకి దిగి రాక తప్పలేదు.
డైరెక్టర్ మురుగదాస్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడం, తమిళనాడు గవర్నమెంట్‌కి సంబంధించి అభ్యంతరకర డైలాగుల్ని తక్షణమే తొలిగించాలంటూ చెలరేగిన వివాదాల్ని సర్కార్ టీమ్ లైట్ తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్, విశాల్ వంటి వారు మద్దతు పలికిన సంగతి కూడా విదితమే. అయితే అనూహ్యంగా సర్కార్ టీమ్ వెనక్కి తగ్గింది. అభ్యంతరకర డైలాగుల్ని మ్యూట్ చేసేందుకు ఒప్పుకుంది. దాంతో రజనీకాంత్, కమల్‌హాసన్, విశాల్ ఇచ్చిన సపోర్ట్ వృధా అయిపోయినట్లైంది.
ఏది ఏమైతేనేమి అసలు సర్కార్ ముందు సినిమా సర్కార్ నిలవలేకపోయింది. దీపావళి సందర్భంగా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సర్కార్' చిత్రం మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ నెగిటివ్ రోల్‌లో కీలక పాత్ర పోషించింది.
విజయ్ సినిమాలు దాదాపు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. కానీ ఈ 'సర్కార్'ని చుట్టుముట్టిన వివాదాలు మాత్రం కాస్త సీరియస్‌గానే సినిమాపై ప్రభావం చూపాయని చెప్పక తప్పడం లేదు.