సూర్య, కార్తి, విశాల్‌లతో పోలిస్తే.... తెలుగులో విజయ్ మార్కెట్ చాలా తక్కువ. తుపాకీ తప్ప విజయ్ నటించిన ఏ సినిమా తెలుగులో మంచి వసూళ్లని అందుకోలేకపోయింది. అయితే ఎప్పటికప్పుడు తెలుగులో పాగా వేయాలనే ప్రయత్నిస్తున్నాడు విజయ్.
ఈసారి 'సర్కార్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళికి రాబోతోంది. తెలుగు రైట్స్ దాదాపుగా రూ.7 కోట్లకు పలికింది. విజయ్ సినిమాల్లో ఇదే రికార్డు. సాధారణంగా విజయ్ సినిమా అంటే రూ.2 నుంచి 4 కోట్ల వరకూ పలుకుతుంది. కానీ... ఈ సినిమా రెట్టింపు ధర అందుకుంది.
దానికి కారణం ఒక్కటే.. ఈ దీపావళికి తెలుగు నుంచి సరైన సినిమా రావడం లేదు. మరోవైపు మురుగదాస్ అంటే.. అభిమానించే వాళ్లు తెలుగులో ఎక్కువగా ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా 'మహానటి'తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటించింది. ఆమె కోసమైనా జనాలు థియేటర్లకు వస్తారని ఆశ.
అందుకే రూ.7 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ సినిమా బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడితే.. ఇక నుంచి విజయ్‌కి తెలుగులో ఓ సుస్థిరమైన మార్కెట్ ఏర్పడినట్టే అనుకోవాలి.