మహేష్ `సర్కారు వారి పాట` ఈనెల 12న వస్తోంది. ఓ వైపు ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వేదిక కూడా రెడీ. పాటలు, ట్రైలర్ ఉర్రూతలూగిస్తున్నాయి. సెన్సార్ కూడా అయిపోయింది. ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే సర్కారు వారి పాటకు చివరి నిమిషం వరకూ రిపేర్ల పర్వం కొనసాగుతూనే ఉందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
సెన్సార్ కి వెళ్లే ముందు రోజు కూడా ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ సినిమాకి కత్తెర్లు పడ్డాయని, సినిమాని వీలైనంత షార్ప్ చేయడానికి చిత్రబృందం ప్రయత్నించిందని తెలుస్తోంది. నిజానికి 2 గంటల 45 నిమిషాల సినిమా ఇది. చివర్లో 10 నిమిషాల సన్నివేశాలకు కత్తెర్లు వేశారు. అంతకు ముందు కూడా కొన్ని సీన్లు రీషూట్లు చేశారని చెప్పుకొన్నారు. ఈమధ్య సినిమా నిడివి ఏమాత్రం ఎక్కువైనా జనాలు బోర్ ఫీలవుతున్నారు. సీన్ ఎంత బాగున్నా సరే, పాస్ అవ్వడం లేదు. అందుకే `ఆచార్య`లో కాజల్ పాత్రకు సైతం కత్తెర పడింది. సీన్లు ఎన్ని లేపేశాం.. ఎన్నిసార్లు సినిమాకి రిపేర్లు చేశాం అన్నది ఎవరూ పట్టించుకోరు. అంతిమంగా సినిమా బాగుండాలంతే. సర్కారు వారి పాట బాగుంటే.. ఆ సినిమాకి ఎన్ని రిపేర్లు చేశారన్నది ఎవ్వరికీ గుర్తుండదు. మహేష్ ఫ్యాన్స్‌కి కూడా కావల్సింది అదే. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో... సముద్రఖని విలన్ గా కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే పాటలన్నీ హిట్టు. తెరపై ఆ పాటలు ఇంకా బాగుంటాయని చిత్రబృందం చెబుతోంది.