మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా `సర్కారు వారి పాట`. ఈ సినిమాపై డివైడ్ టాక్ చాలా గట్టిగానే నడిచింది. అయితే వసూళ్ల హవా మాత్రం తగ్గలేదు. తొలి 4 రోజుల్లో 81 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో ఇప్పటి వరకూ 24 కోట్లొచ్చాయి. అయితే..ఈ సినిమాని నైజాంలో దాదాపు రూ.40 కోట్లకు కొన్నారు దిల్ రాజు. అంటే మరో 16 కోట్లు రావాలి. వడ్డీలు, ఇతర ఖర్చులతో కలుపుకున్నా. మొత్తంగా 18 కోట్ల వరకూ రావాలి.
సోమవారం నుంచి వసూళ్లు బాగా డల్ అయిన నేపథ్యంలో... మరో 18 కోట్లు తెచ్చుకోవడం దాదాపుగా అసాధ్యం. నైజాంలో ఫైనల్ రన్ రూ.33 కోట్ల వరకూ వచ్చి ఆగిపోతుందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. అంటే... దాదాపు రూ.10 కోట్ల వరకూ దిల్ రాజుకి నష్టాలు తప్పవన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. నైజాం ఒక్కటే కాదు... మరికొన్ని ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి. చాలా ఏరియాల్లో బొటా బొటీగా గట్టెక్కుతారని, లాభాలు చూసే ప్రసక్తే లేదన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సినిమాని ఎక్కువ రేట్లకు పెట్టి కొనడం, పెరిగిన రేట్ల దృష్ట్యా.. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడకపోవడంతో... వసూళ్లు పెద్దగా కనిపించడం లేదు.