చారిత్రక కథాంశాలతో సినిమాలు తీస్తే, కమర్షియల్ అంశాలు అందులో తక్కువగా ఉంటే అలాంటి సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయా? లేదా? అనే సందేహాలకు తెరదించేసింది 'గౌతమి పుత్ర శాతకర్ణి'. బడ్జెట్ భారీగానే ఖర్చయినా, ఇంతటి భారీ చిత్రానికి అది తక్కువే. తక్కువ సమయంలో అద్భుతమైన సినిమాల్ని తీయొచ్చని దర్శకుడు క్రిష్ నిరూపిస్తే, అలాంటి ప్రయోగాలకు తానెప్పుడూ సిద్ధమని బాలకృష్ణ అండగా నిలవడం 'గౌతమి పుత్ర శాతకర్ణి' విజయానికి కారణం. సెలవులు ముగిశాయి, సాధారణ రోజులు మొదలయ్యాయి. మళ్ళీ వీకెండ్ కూడా వచ్చేస్తోంది. అయితే 'గౌతమి పుత్ర శాతకర్ణి' మేనియా ఎక్కడా తగ్గలేదు. ఓవర్‌సీస్‌లోనూ, అలాగే ఇండియాలోనూ 'శాతకర్ణి' హవా కొనసాగుతోంది. ఈ వీకెండ్ ముగిసేనాటికి 'శాతకర్ణి' సృష్టించబోయే వసూళ్ళ సంచలనాలు ఇంకెలా ఉంటాయోనని సినీ పరిశ్రమ ఎదురుచూస్తోంది. ఏదేమైనా ఇలాంటి సినిమాలు ముందు ముందు చాలా రావడానికి 'శాతకర్ణి' మంచి కిక్ ఇచ్చింది. ఆ కిక్ దర్శకుడు క్రిష్ రూపంలో, హీరో బాలకృష్ణ రూపంలోనూ లభించింది. 'ఖైదీ నెంబర్ 150' లాంటి ఫక్తు కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ ముందు, 'శాతకర్ణి' ధీటుగా నిలబడటం సినీ పరిశ్రమను ఆనందంలో ముంచెత్తింది. రెండు పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికి అతి పెద్ద విజయాలు నమోదు చేయడాన్ని ఎవరు మాత్రం హర్షించరు? అభిమానుల గొడవలెలా ఉన్నప్పటికీ హీరోలుగా తామంతా కలిసే ఉంటామని చిరంజీవి, బాలకృష్ణ పరస్పరం అభినందించుకున్న తీరు కూడా ఈ రెండు సినిమాల ఘనవిజయంలో ఎంతో కొంత పాలుపంచుకుందని చెప్పవచ్చు.