సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన సినిమా `గుర్తుందా శీతాకాలం`. నాగశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసి వాయిదా వేశారు. టీజర్, పాటలు కూడా వచ్చాయి. కానీ సడన్ గా ఈ సినిమా ప్రమోషన్లు, అప్ డేట్లూ ఆగిపోయాయి. అసలు ఈ సినిమా ఒకటి ఉందన్న సంగతి జనం మర్చిపోయారు.
`గాడ్ ఫాదర్`తో సత్యదేవ్ క్రేజ్ ఇంకాస్త పెరిగినప్పుడు, ఆ ఊపులో అయినా ఈసినిమాని విడుదల చేస్తారనుకొన్నారు. కానీ జరగలేదు. ఎండాకాలం రావాల్సిన సినిమా ఇది. ఆ తరవాత వర్షాకాలంలో విడుదల అన్నారు. ఇప్పుడు.. శీతాకాలం వచ్చేసింది. దాంతో.. కొత్త రిలీజ్‌డేట్ ప్రకటించారు. డిసెంబరు 9న ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం చెబుతోంది. శీతాకాలంలో.. గుర్తుందా శీతాకాలం సినిమా కొత్త అనుభూతి ఇవ్వడం ఖాయమని.. సత్యదేవ్ ధీమాగా చెబుతున్నాడు. సత్యదేవ్ - తమన్నా.. ఈ కాంబో కాస్త విచిత్రంగానే కనిపిస్తోంది. టైటిల్ చూస్తే.. మంచి లవ్ స్టోరీ అనే ఫీల్ కలుగుతుంది. తమన్నా కోసమైనా ఈ సినిమాని జనం చూస్తారన్నది నిర్మాతల నమ్మకం. మరి గుర్తుందా శీతాకాలం.. ఈ శీతాకాలమైనా వస్తుందో, రాదో చూడాలి.