చిత్రం: సత్య
దర్శకత్వం: వాలీ మోహన్‌దాస్
నటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్
నిర్మాతలు: శివమల్లాల
సంగీతం: సుందరమూర్తి కె.యస్
ఛాయాగ్రహణం: ఐ. మరుదనాయగం
కూర్పు: ఆర్.సత్యనారాయణ
బ్యానర్స్: శివమ్ మీడియా
విడుదల తేదీ: 10 మే 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
శుక్రవారం వచ్చింది అంటే కొత్త సినిమాల జాతర మొదలవుతుంది. సినీ ప్రియులు ప్రతి వారం ఆశగా ఎదురుచూస్తుంటారు. అలా ఈ వారం కూడా ఓ నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో 'సత్య' మూవీ ఒకటి. ఈ పేరుతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి కానీ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. హమరేశ్, ప్రార్ధనా సందీప్, ‘ఆడుగాలం’ మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు నటించిన ఈ సినిమాకి వాలీ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. శివమల్లాల నిర్మించారు. 'సత్య' సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందిందో లేదో చూద్దాం.
కథ: హీరో సత్యమూర్తి గవర్నమెంట్ కాలేజిలో ఇంటర్మీడియట్ చదువుతుంటాడు. లైఫ్ ని సీరియస్ గా తీసుకోకుండా ఆడుతూ, పాడుతూ సరదాగా తిరిగే టీనేజ్ కుర్రాడి లైఫ్ లో అనుకోకుండా జరిగిన సంఘటనల ఒక్కొక్కటి ఆ కుర్రాడి జీవితాన్ని ఎలా మార్చాయి అన్నది కథ. ఓ రోజు కొందరు స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతుండగా, వాళ్లల్లో వాళ్లే గొడవపడుతుంటారు. చివరికి కొట్టుకునేదాకా చేరుతుంది ఆ గొడవ. అది చూసి హీరో సత్య అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు మీద ఆ ఏరియా పోలీసులకు ఎదురుపడతాడు. దాంతో పిల్లలని, సత్యని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళతారు. సత్య అమ్మ, నాన్న, అక్క అందరూ స్టేషన్‌కి వస్తారు. కొడుకుని అలా స్టేషనులో చూసిన సత్య తండ్రి ‘ఆడుగాలం’ మురుగదాస్ బాగా చదివే పిల్లాడు, చెడు సావాసాల వలన పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కవలసి వచ్చింది అని బాధతో కాలేజీ మార్చాలని అనుకుంటాడు. అప్పటివరకు గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు లేకుండా చదివే పిల్లాడికి ఇప్పుడు ప్రెవేటు కాలేజ్ లో ఫీజ్ సమస్య ఏర్పడుతుంది. బస్తీలో ఎదో లాండ్రీ పనిచేసుకుంటూ రోజులు గడిపేస్తున్న వాళ్ళ జీవితాల్లో ప్రైవేట్ కాలేజి, ఫీజులు లాంటి పెను భారం పడుతుంది. సత్యకి మాత్రం తాను చదివే కాలేజి, ఫ్రెండ్స్‌ని వదిలి వెళ్లటం ఇష్టం ఉండదు. తప్పనిసరి పరిస్థితిలో తన తల్లి తండ్రుల మాట కాదనలేక తలవంచుతాడు. కొత్తగా చేరిన కార్పొరేట్ కాలేజ్ లో పార్వతి (ప్రార్ధన సందీప్) పరిచయమవుతుంది. పార్వతి పరిచయంతో వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? తోటి స్టూడెంట్స్ ఎలాంటి వారు? టీచర్స్ సత్యను ఎలా ట్రీట్ చేస్తారు? గౌతమ్, సత్యల మధ్య గొడవలకి కారణం, ఇష్టం లేకుండా చేరిన కాలేజితో సత్యకి ఎలాంటి అనుబంధం ఏర్పడింది అన్నది సినిమాలో చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ: హీరో హమరేశ్, నటనాపరంగా మంచి మార్కులే సంపాదించాడు. సీనియర్ యాక్టర్ అయిన ఆడుగాలం మురుగదాస్ తో పోటిగా నటించాడనే చెప్పొచ్చు. మూవీలో హీరో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సమప్రాధన్యత ఉంటుంది. హీరో తల్లి, సోదరి క్యారెక్టర్స్ కూడా ముఖ్యమైనవే. తండ్రి కొడుకుల అనుబంధం తో పాటు ఎమోషన్స్ కూడా బానే బ్యాలెన్స్ చేసాడు దర్శకుడు. సాధారణంగా తండ్రికి పిల్లల పై ప్రేమ ఉన్న బయటికి వ్యక్తం చేయరు. చాలా సినిమాల్లో కూడా ఈ విషయం చెప్పారు. కానీ ఈ సినిమాలో తండ్రి ప్రేమ విపరీతంగా ఉంటుంది. కొడుకును ఎవరేమన్నా తట్టుకోలేని తండ్రి పాత్రలో మురుగదాస్ నటన చాలా న్యాచురల్ గా ఉంది.
గవర్నమెంట్ స్కూల్, కార్పొరేట్ స్కూళ్ల మధ్య వ్యత్యాసం, సడెన్ గా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లాడు కార్పొరేట్ ప్రపంచంలోకి వెళ్తే అతడి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. తమ బతుకు ఎలా ఉన్నా పిల్లల జీవితాలు బాగుండాలని ఆశతో స్తోమతకి మించి చదువు చెప్పించే ఓ తండ్రి తపన ఇందులో కనిపిస్తాయి. చివరికి తండ్రి బాధను అర్థం చేసుకొని సత్య తీసుకునే నిర్ణయాన్ని డైరెక్టర్ కన్వీన్సింగ్‌గా ప్రజంట్ చేసాడు.
సాంకేతికం గా: సత్య మూవీ దర్శకుడు వాలీ మోహన్‌దాసే కథ కూడా రాసుకున్నాడు. మొదటి ప్రయత్నం లోనే సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో చూపించిన మిడిల్ క్లాస్ జీవితాలు సగటు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు సుందరమూర్తి గూర్చి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా స్థాయిని పెంచాడనే చెప్పొచ్చు. కెమెరా మెన్ గొప్పతనం గూర్చి కూడా ప్రశంసించాల్సిందే. మొత్తానికి పరీక్షలు అయిపోయి ఉన్న పిల్లలని తీసుకుని థియేటర్ కి వెళ్లాలనుకునే వారికి, స్టూడెంట్స్ కి పరవాలేదనిపిస్తుంది. సమకాలీన అంశాలతోపాటు ఒక మెసేజ్ ను కూడా అందించాడు డైరెక్టర్. మొత్తానికి 'సత్య' మూవీ సందేశంతో కూడిన బ్యూటీఫుల్ టీనేజ్ లవ్‌స్టోరీ. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే పరవాలేదనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
ఇంటర్వెల్ సీన్
ప్రీ–క్లైమాక్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్
డబ్బింగ్
తెలిసిన నటీనటులు కూడా లేకపోవడం
ఫైనల్ వెర్డిక్ట్: ఆలోచింపజేసే 'సత్య'..!