బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ హీరోగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటూనే నిర్మాతగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంటాడు. అదే అమీర్‌ఖాన్ స్పెషాలిటీ. డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలను ఎంచుకుంటూ ఉంటాడు. ఇటీవలే 'దంగల్' సినిమాతో రికార్డులు సృష్టించిన అమీర్ ఖాన్, తాజాగా ఓసినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అమీర్ ఖాన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతోంది. 'సీక్రెట్ సూపర్ స్టార్' టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లేటెస్టుగా విడుదలయ్యింది. జైరా వాసిం ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. గాయని కావాలనుకునే అమ్మాయి, ఆమె ఇంట్లో రోజూ తప్పతాగి వచ్చే తండ్రి, ఆ తండ్రి నుంచి తన కుటుబాన్ని కాపాడుకునే అమ్మాయి, ఈ క్రమంలోనే తన ఆశయం నెరవేర్చుకోవడం కోసం ఆ అమ్మాయి ఎలా కష్టపడిందన్నదే ఈ సినిమా కథ. ఓ అమ్మాయి స్కూల్ డ్రస్సు వేసుకుని నడుస్తున్నట్లుగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. అమ్మాయి కథ సరే, మరి అమీర్ ఖాన్ లుక్ ఎలా ఉండబోతోంది, అసలు అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఏంటి అనే ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఆగస్ట్ 2న ట్రైలర్‌ని విడుదల చేస్తారు. దీపావళికి 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమా విడుదలవుతుంది. అద్వైత్ చందన్ దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.