సినిమా సెలబ్రిటీలంటే ప్రజల్లో అభిమానం మెండుగా వుంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే వాళ్ళూ మనుషులే. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుండగా హరికృష్ణతో ఆ ఆసుపత్రి సిబ్బంది సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నందమూరి అభిమానులు ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. సెల్ఫీ తీసుకున్న సిబ్బందిని తక్షణం తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అమానవీయమైన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. తీవ్ర గాయాలతో అచేతనావస్థలో వున్న హరికృష్ణతో సెల్ఫీ దిగే ప్రయత్నం ఎలా చేశారోగానీ, ఆసుపత్రి సిబ్బంది ఇంత కర్కశంగా వుంటారా? అని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాదు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
చికిత్స పొందుతున్న సమయంలో హరికృష్ణకి ఆక్సిజన్ అందించేందుకు పలు ఏర్పాట్లు చేశారు. ఇంకో వైపున శరీరాన్ని శుభ్రం చేసే క్రమంలో షర్ట్‌ని తొలగించారు. ఇలాంటి పరిస్థితుల్లో వున్న హరికృష్ణతో సెల్ఫీ దిగాలని ఎలా ఆ సిబ్బందికి అనిపించిందో ఏమో. గౌరవ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించడంలో పెద్ద మనసు చాటుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఈ సెల్ఫీ విషయంలో సీరియస్‌గా వ్యవహరించకపోతే.. హరికృష్ణకి ఇచ్చిన గౌరవం పరిపూర్ణం కాబోదు.