పవిత్రబంధం లాంటి ధారావాహికలతో పేరు తెచ్చుకున్న వర్థమాన నటి ఝాన్సీ. పలు టీవీ సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ మంగళవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 21 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
గత కొంతకాలంగా ఝాన్సీ సూర్య అనే అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలుస్తోంది. సూర్య పరిచయం తరవాత... ఝాన్సీ సీరియళ్లకు కూడా దూరంగా ఉంటోందని, ఇటీవల సూర్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. మంగళవారం రాత్రి ఇద్దరూ మళ్లీ గొడవ పడ్డారని, ఆ తరవాతే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. ఝాన్సీ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.