బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఇప్పుడు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చేసింది. ఈ కేసులో ముందు నుంచీ అందరి దృష్టీ దేవరాజ్ రెడ్డిపైనే ఉంది. దేవరాజ్ వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా సాయి పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు సాయి వల్లే.... శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాధమిక నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది. అటు సాయిని, ఇటు దేవరాజ్‌నీ పోలీసులు విడివిడిగా విచారించారు. వీడియో, ఆడియో టేపులతో పాటు కొన్ని కీలకమైన ఆధారాల్ని సేకరించారు. అవే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారాయి. పోలీసుల కథనం ప్రకారం... శ్రావణి - సాయి ప్రేమించుకున్నారు.
దేవరాజ్ పరిచయం అయ్యాక... శ్రావణి సాయిని దూరం పెట్టింది. దాంతో సాయి శ్రావణిపై కోపం, కసి పెంచుకుని వేధించడం మొదలెట్టాడు. ఇటీవల దేవరాజ్ తో, శ్రావణి ఓ రెస్టారెంట్ కి వెళ్లింది. అక్కడ వీరిద్దరినీ చూసిన సాయి.. శ్రావణితో గొడవ పడ్డాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. దేవరాజ్ తో తిరుగుతుందన్న విషయం తెలుసుకున్న శ్రావణి కుటుంబ సభ్యులు కూడా శ్రావణిని తీవ్రంగా తిట్టారు. కొట్టారు. ఈ వేధింపులు భరించలేకే.. శ్రావణి ఆత్మహత్య చేసుకుని ఉంటుందేమో అన్నది పోలీసుల అనుమానం.
శ్రావణి తమ్మడు శివ మాత్రం... తన అక్క మరణానికి కారణం.. దేవరాజే అంటున్నాడు. శ్రావణి ఆత్మహత్య చేసుకోబోతోందన్న విషయం దేవరాజ్‌కి తెలుసని, కానీ చెప్పలేదని, తమకు చెప్పి ఉంటే తమ అక్కని కాపాడుకునేవాళ్లమని చెబుతున్నాడు. ఈ కేసులో నిర్మాత అశోక్ రెడ్డి ప్రమేయం ఏమిటన్నది తేలాల్సివుంది. ఈరోజు అశోక్ రెడ్డిని సైతం.. పోలీసులు విచారించబోతున్నారు. అశోక్ రెడ్డి స్టేట్‌మెంట్ తీసుకున్న తరవాత... ఈకేసుపై పోలీసులు ఓ నిర్దారణకు రావొచ్చు.