థియేటర్లు మూతపడడంతో గత నాలుగైదు నెలలుగా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వేదికలపై ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఓటీటీ వేదికలకు ఆదరణ పెరిగింది. పెరుగుతున్న ఆదరణను గమనించిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ప్రముఖ ఓటీటీ నివేదికలు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. హిందీలో ఇప్పటికే వెబ్ సిరీస్, వెబ్ ఫిలిమ్స్ ఆంథాలజీ ఫిలిమ్స్ నిర్మిస్తూ ఒరిజినల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈ ఓటీటీ వేదికలు ఈ మధ్య సౌత్ ప్రేక్షకులపై కూడా దృష్టి సారించాయి.
ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వారు హిందీలో విజయవంతమైన 'లస్ట్ స్టోరీస్' సిరీస్ ను తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ రీమేక్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ వారు ప్రముఖ దర్శకులను ఎంచుకున్నారు. నందిని రెడ్డి, గౌతమ్ మీనన్, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, సుధా కొంగర ఈ సిరీస్ ను రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రముఖ ఓటీటీ వేదిక అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్షిణాది ప్రేక్షకుల కోసం ఒక రియాలిటీ టచ్ ఉండే ఆంథాలజీ సిరీస్ ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ బాటలోనే ఈ సిరీస్ రూపొందించేందుకు ప్రముఖ దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నారట.
మణిరత్నం, కార్తీక్ సుబ్బరాజ్, రాజీవ్ మీనన్, గౌతమ్ మీనన్ లాంటి వారితో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే ఈ సిరీస్ ను దర్శకత్వం వహించే బాధ్యతలను వారికి అప్పగిస్తారని అంటున్నారు. లస్ట్ స్టోరీస్ తరహాలోనే ఈ సిరీస్ కూడా బోల్డ్ గా, ఈ జనరేషన్ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.