శంకర్... దేశం మొత్తమ్మీద అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శక దిగ్గజం. శంకర్ తో సినిమా అంటే... ఏ స్టార్ అయినా సరే, `ఓకే` అనేస్తాడు. అదీ ఆయన రేంజ్. అయితే ఈమధ్య శంకర్ టైమేం బాలోదు. వరుసగా.. దెబ్బమీద దెబ్బ. రోబో 2 అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. `భారతీయుడు 2` షూటింగ్ లో ప్రమాదం సంభవించింది. ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. నిర్మాతలతో గొడవలు మొదలయ్యాయి.
సరికదా.. అని ఆ సినిమా పక్కన పెట్టి, రామ్ చరణ్ తో సినిమా మొదలెడదామనుకుంటే.. లైకా ప్రొడక్షన్ మోకాలు అడ్డుతోంది. భారతీయుడు 2 లెక్క తేల్చమంటోంది. అపరిచితుడు ని బాలీవుడ్ లో రీమేక్ చేద్దామంటే.. అక్కడా అపశకునాలే. ఆస్కార్ రవిచంద్రన్... `రీమేక్ చేసే హక్కు నీకెక్కడ ఉంది` అంటూ ప్రశ్నించడం మొదలెట్టాడు. ఇది కూడా కోర్టు గొడవల వరకూ వెళ్లడం ఖాయంగా అనిపిస్తోంది. భారతీయుడు 2 సినిమా పూర్తయ్యే వరకూ... శంకర్ మరో సినిమా మొదలెట్టే ఛాన్సులు కనిపించడం లేదు. దానికి తోడు కోర్టు గొడవలు శంకర్ కి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే శంకర్ టైమ్ మరీ ఇంత ఘోరంగా నడుస్తుందేమిటో అనిపిస్తోంది. ఈ కష్టాల నుంచి శంకర్ ఎప్పుడు గట్టెక్కుతాడో?