'రోబో 2.0' కోసం ఏకంగా నాలుగేళ్లు టైం తీసుకున్న శంకర్ ఇక ఇప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయనంటున్నాడు. త్వరలోనే 'ఇండియన్ 2'పై దృష్టి పెడతానంటున్నాడు. '2.0' కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. '2.0' సెన్సేషనల్ విజయం అందుకుంది. అందరి నోటా పోజిటివ్ టాకే వస్తోంది. ఇక తృప్తిగా 'ఇండియన్ 2' సినిమాని తెరకెక్కిస్తానని శంకర్ అంటున్నారు. 2.0 ఇచ్చిన సక్సెస్ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందట.
దాంతో డిశంబర్ 14 నుండే 'ఇండియన్ 2' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తానని శంకర్ చెప్పారు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్ - శంకర్ కాంబో రిపీట్ అవుతోంది. 1996లో వచ్చిన 'ఇండియన్' (తెలుగులో భారతీయుడు) చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌గా రాబోతోంది 'ఇండియన్ 2'. ఇందులో కూడా కమల్‌హాసన్ డ్యూయల్ రోల్ పోషించనున్నారు. కమల్ తండ్రి పాత్ర అయిన సేనాపతి పాత్ర సినిమాకు ఎంతో కీలకం.
ఆ పాత్రను ఈ సీక్వెల్‌లో కూడా అంతకు మించి పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారట. ఆ పాత్ర కోసం హాలీవుడ్ నుండి మేకప్ ఆర్టిస్టులను తీసుకొచ్చారట. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ని హైద్రాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటించనుందనీ ప్రచారం జరుగుతోంది. '2.0'ని రూపొందించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే 'ఇండియన్ 2' కూడా రూపొందుతోంది.