'వేశ్య పాత్రలో లోతైన భావోద్వేగాలుంటాయి..ఆ పాత్రలో నటించే అవకాశమొస్తే ఖచ్చితంగా నటిస్తాను. అని ఇటీవల బుల్లితెర యాంకర్ కమ్ నటి రేష్మి చెప్పింది. కానీ ఇప్పుడా అవకాశం మరో హాట్ బ్యూటీ శ్రద్దాదాస్‌కి వచ్చింది.
హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ఉండాల్సిన అన్ని షేడ్స్ ఈ పాపలో ఉన్నా, పాపం ముద్దుగుమ్మ శ్రద్దాదాస్‌కి దాన్ని నిరూపించుకునే అవకాశమే రావడం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, ఎక్కడా ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు దక్కడం లేదు. అయితే ఇప్పుడు శ్రద్ధాదాస్ ట్రాక్ మార్చేసింది.
ఈ మధ్య షార్ట్‌ఫిల్మ్స్‌తో కూడా పలువురు నటీనటులు బాగా పాపులర్ అవుతున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ బిగ్ స్క్రీన్ నుండి, షార్ట్ స్క్రీన్ వైపు అడుగులు కదుపుతోంది. 'శృంగార్ దాన్' అనే ఓ షార్ట్‌ఫిల్మ్‌లో శ్రద్ధాదాస్ నటిస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో శ్రద్దా 'షాయిబా' అనే ఓ వేశ్య పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ పాత్ర గురించి శ్రద్దా కూడా అచ్చం రేష్మీ ఎలా చెప్పిందో అలాగే చెబుతోంది. ఈ పాత్రలో చాలా భావోద్వేగాలుంటాయి.
నటిగా పరిణితి చెందాలంటే ఈ తరహా పాత్రల్లో కనిపిస్తేనే సాధ్యపడుతుంది. తనకీ పాత్ర మంచి పేరు తీసుకొస్తుందనీ, షార్ట్ ఫిల్మ్ కదా అని తక్కువంచనా వేయడానికి లేదు అని శ్రద్దా చెబుతోంది. మొత్తానికి రేష్మీ కలను ఈ రకంగా శ్రద్దాదాస్ నెరవేర్చుకుంటోందన్న మాట. వేశ్య పాత్రలో నటించాలన్న రేష్మీ కల నెరవేరాలంటే, ఆమె కూడా ఏ షార్ట్‌ఫిలింనో నమ్ముకుంటే మంచిదేమో.!