ఇంట్లో లెక్కకు మించి ఆడవాళ్లు ఉంటే భలే సరదా.. కాలక్షేపం. అయితే అందులో ఉన్న బాధలు ఓ బ్రహ్మచారికి అర్థమయ్యాయి. పెళ్లీడు వచ్చిన కుర్రాడికి.. ఓ మంచి సంబంధం వెదికి పట్టుకోవడానికి పది మంది వీర వనితలు బయల్దేరారు. ఒకరికి నచ్చిన సంబంధం, మరోకరకి నచ్చదు. దాంతో అమ్మాయిల్ని రిజెక్ట్ చేస్తూ చేస్తూ వెళ్లారు. చివరికి అమ్మాయిలే అబ్బాయిని రిజెక్ట్ చేసే స్థాయికి పడిపోతే... ఆ కుర్రాడి బాధ వర్ణానాతీతం. శర్వానంద్ సినిమా `ఆడవాళ్లూ మీకు జోహార్లూ` కాన్సెప్ట్ అదే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సినిమా ఇది. టైటిల్, పోస్టర్, పాటలతో ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు.. టీజర్ వచ్చేసింది.
పదిమంది ఆడవాళ్లు ఉన్న ఇంట్లో... ఓ అబ్బాయి. ఆ అబ్బాయికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆ ఆడాళ్లదే. అక్కడి నుంచి ఈ కథ మొదలవుతుంది. `నేను రిజెక్ట్ చేసే స్థాయి నుంచి నన్ను రిజెక్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చాశారా` అంటూ ఫస్ట్రేషన్‌కి గురైన ఓ కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి (రష్మిక) ఎదురవుతుంది. `మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో గానీ, వాళ్లు నిజంగా అదృష్టవంతురాలు` అనుకునే ఆ అమ్మాయికి.. ఆ అదృష్టాన్ని తానే ఇవ్వాలని ఫిక్సవుతాడు.కానీ.. కథ అడ్డం తిరుగుతుంది. అక్కడి నుంచి అతని ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందో తెరపై చూడాల్సిందే. టీజర్ ఫన్ రైడ్ గా సాగింది. చుట్టూ పదిమంది లేడీ క్యారెక్టర్లు, మధ్యలో శర్వానంద్.. ఓ అందమైన అమ్మాయి.. ఇలా కాంబినేషన్ చూడముచ్చటగా ఉంది. శర్వా కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు చేసినా బాగా వర్కవుట్ అయ్యాయి. ఈసారీ.. ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈనెల 25న ఈ సినిమా విడుదల అవుతోంది.