ఆర్.ఎక్స్ 100 లాంటి సూపర్ హిట్టిచ్చిన తరవాత కూడా అజయ్ భూపతి కామ్ అయిపోయాడు. రవితేజ, నాగచైతన్యలాంటి హీరోలకు కథలు చెప్పి, వాళ్లనుంచి ఓకే అనిపించుకున్న తరవాత కూడా ఆ సినిమాల్ని పట్టాలెక్కించలేకపోయాడు. మహా సముద్రం అనే కథ చాలా మంది హీరోల చేతుల్లో నలిగింది. ఇప్పుడు తాజాగా శర్వానంద్ పేరు వినిపిస్తోంది. శర్వానంద్ ఈ కథకు ఓకే చెప్పాడని 2020 వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని 2021 సంక్రాంతికి విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే శర్వానంద్ అయినా ఖాయమేనా, లేదంటే ఆయనా తప్పుకుంటాడా? అనే అనుమానాలూ మొదలైపోయాయి.
శర్వానంద్ చేతిలో రెండు సినిమాలున్నాయి. 96 రీమేక్ అవ్వాలి, ఆ తరవాత శ్రీకారం పూర్తవ్వాలి. అప్పటి వరకూ అజయ్ భూపతి ఆగుతాడా, లేదా? అనేది చూడాలి. అన్నింటికంటే ముఖ్యంగా మహా సముద్రం ఓ మాస్ కథ. ఆ కథ.. శర్వానంద్‌కి వర్కవుట్ అవుతుందా, లేదా? అనేది పెద్ద ప్రశ్న. ఇది వరకు శర్వానంద్ మాస్ హీరోగా కొన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అవి వర్కవుట్ అవ్వలేదు. శర్వా మళ్లీ అలాంటి తప్పే చేస్తే మాత్రం తన దగ్గరకెప్పుడూ మాస్ కథలు రావు. ఇలాంటి తరుణంలో శర్వా ఈ కథని ఓకే చేసే సాహసం ఎలా చేశాడో మరి..??