చారిత్రక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు యువ కథానాయకులు. టైమ్ మిషన్ ఎక్కి - ప్రేక్షకుల్ని ఆనాటి కాలంలోకి తీసుకెళ్తున్నారు. అలాంటి కథలకు మంచి ఆదరణ దక్కుతోంది కూడా. ఈ నేపథ్యంలో శర్వానంద్ కూడా అలాంటి కథే ఎంచుకున్నాడు. ప్రస్తుతం `శ్రీకారం` సినిమాతో బిజీగా ఉన్నాడు శర్వా. లాక్ డౌన్ ఎత్తేశాక, ఈ సినిమా విడుదల కానుంది.
ఆ తరవాత `మహాసముద్రం` చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. వీటితో పాటు మరో కథనీ ఓకే చేశాడు శర్వానంద్. చందూమెండేటి దర్శకత్వంలో శర్వా ఓ సినిమా చేయబోతున్నాడు. కథ కూడా సిద్ధమైంది. 1920 నేపథ్యంలో సాగే కథ ఇది. అంటే సరిగ్గా వందేళ్ల క్రితం నాటి కథ అన్నమాట. సోషియో ఫాంటసీ, క్రైమ్ లాంటి అంశాల్ని ఇందులో మేళవించాడట. ఇలాంటి జోనర్ చేయడం శర్వాకి ఇదే తొలిసారి. విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తున్న శర్వా.. ఈసారి ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.