ఒక సినిమాకి ట్రైలర్ కి ఉండాల్సిన ప్రధాన లక్షణం.. ఆ సినిమాపై ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచడం. ఎలాంటి కథ చెప్తారో, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో అనే ఆసక్తిపెంచడం. ఇలా ఆసక్తిని పెంచే విషయంలో మాత్రం విజయ్ వారసుడు వెనకబడిపోయింది. సంక్రాంతికి సందడి చేయనున్న చిత్రాల్లో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) ఒకటి. తమిళ నటుడు విజయ్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. తాజాగా ట్రైలర్ ని వదిలారు. ట్రైలర్ చూడటానికి బావుంది కానీ తెలుగు ప్రేక్షకులకు వారసుడు కథ ఇట్టే తెలిసిపోయింది.
ఒక ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబాన్ని విడదీసి వారి వ్యాపారాలపై దెబ్బకొట్టాలని ఒకడు ప్రయత్నిస్తాడు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవ.. ఫైనల్ గా హీరో ఎలా ఉమ్మడి కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచాడనేది మిగతా కథ. ఇలాంటి కథ తెలుగు సినిమాలో పరమ రొటీన్. సూపర్ గుడ్ సినిమాలు మా అన్నయ్య, సంక్రాంతి టైపు కథ ఇది. తమిళ్ ఆడియన్స్ కి విజయ్ లాంటి హీరో ఇలాంటి కథ చేయడం కొత్త ఏమో కానీ ఈ కథపై క్యురీరియాసిటీని కలిగించడంలో ట్రైలర్ విఫలమైయింది. పైగా మేకింగ్ కూడా వంశీ గత సినిమాలనే గుర్తు చేసింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ వుంటే సంక్రాంతి సినిమాలు అద్భుతంగా వర్క్ అవుట్ అవుతాయనే నమ్మకం దిల్ రాజుది. మరి ఆయన నమ్మకం ఏమౌతుందో చూడాలి.