ఒకటా, రెండా..? వరుసగా ఆరు ఫ్లాపులు శర్వానంద్ ని చుట్టు ముట్టాయి. `పడి పడి లేచె మనసు` దగ్గర్నుంచి మొన్నటి `ఆడవాళ్లు మీకు జోహార్లు` వరకూ అన్నీ ఫ్లాపులే. `మహా సముద్రం` అయితే డిజాస్టర్ అయిపోయింది. ఇన్ని ఫ్లాపులొస్తే, ఏ హీరో అయినా ఏం చేస్తాడు? చటుక్కున పారితోషికం తగ్గిస్తాడు. కానీ శర్వా మాత్రం `ఫ్లాపులొచ్చినా పారితోషికం తగ్గేదేలే` అంటున్నాడు. అవును... శర్వా తన పారితోషికాన్ని సినిమా సినిమాకీ పెంచుకుంటూనే వెళ్తున్నాడన్నది టాలీవుడ్ టాక్. ఒక్కో సినిమాకీ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని, అది చూసి నిర్మాతలంతా షాక్ తింటున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇటీవల ఓ అగ్ర నిర్మాణ సంస్థ శర్వాతో సినిమా చేయడానికి ముందుకొచ్చింది. అయితే శర్వా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడట. అయితే.. ఇదంతా `ఆడాళ్లూ మీకు జోహార్లు` సినిమాకి ముందు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది కదా, రెమ్యునరేషన్ ఏమైనా తగ్గిస్తాడేమో అనుకుంటే, శర్వా మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదు అని ఖరాఖండీగా చెప్పేశాడట. దాంతో ఆ నిర్మాత వెనక్కి వెళ్లిపోయాడు. శర్వా సినిమా హిట్టయితే, బాక్సాఫీసు దగ్గర కనీసం రూ.25 కోట్లు వసూలు చేస్తుంది. తనకి అటూ ఇటూగా రూ.30 కోట్ల మార్కెట్ ఉంది. అలాంటప్పుడు రూ.10 కోట్లు పారితోషికం ఇవ్వడంలో తప్పు లేదు. కానీ శర్వా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. `ఆడాళ్లూ మీకు జోహార్లు` అయితే రూ.10 కోట్లు కూడా దక్కించుకోలేదు. ఇలాంటప్పుడు శర్వాకి అంతంత పారితోషికం ఎలా ఇస్తారు? అందుకే తనకొస్తున్న ఆఫర్లు వెనక్కి వెళ్తున్నాయని తెలుస్తోంది.