ఈమధ్య టాలీవుడ్ లో రీమేక్ సినిమాల జోరు పెరిగింది. ఇప్పటికే పలు రీమేక్ సినిమాలు పట్టాల మీద ఉండగా మరికొన్ని ప్లానింగ్ దశలో ఉన్నాయి. కొన్నేమో కొత్తగా రీమేక్ సినిమాల జాబితాలోకి చేరుతున్నాయి. వెంకటేష్ 'నారప్ప', రామ్ 'రెడ్' లాంటి సినిమాలు షూటింగ్ దశలో ఉండగా చిరంజీవి 'లూసిఫర్', నితిన్ 'అంధా ధున్' రీమేక్ లు ప్లానింగ్ దశలో ఉన్నాయి. సితార బ్యానర్ రెండు సినిమాలను రీమేక్ చేసే ప్రయత్నాలలో ఉండడం గమనార్హం.
సితార వారు ఇప్పటికే 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాను రానా దగ్గుబాటితో రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నటించనున్న రెండో హీరో గురించి కూడా ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇంతవరకూ అధికారికంగా ప్రకటన రాలేదు. తాజాగా మలయాళ చిత్ర నిర్మాత విష్ణు వేణు ఈ రీమేక్ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ధృవీకరించారు. గతంలో ప్రేమమ్, అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాల రైట్స్ తీసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ వారు 'కప్పెలా' రైట్స్ తీసుకున్నారని ఆయన వెల్లడించారు.
దీంతో సితార బ్యానర్ రెండు సినిమాల రీమేక్ లను లైన్లో పెట్టినట్టు కన్ఫామ్ అయింది. 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ సంగతి ముందుగానే అందరికీ తెలిసినా ఇది అధికారిక ప్రకటన అనుకోవాలి. 'కప్పెలా' విషయానికి వస్తే ఇదో రొమాంటిక్ థ్రిల్లర్. ఆనా బెన్, శ్రీనాథ్ బాసి, రోషన్ మాథ్యూ లు ఈ సినిమాలో ప్రథాన పాత్రలలో నటించగా ముహమ్మద్ ముస్తఫా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పేరును ప్రస్తావిస్తూ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెలుగులో వస్తున్న ఫార్మాట్ కమర్షియల్ సినిమాలపై ఈమధ్య చురకలు అంటించిన సంగతి తెలిసిందే.