ప్రార్థించే పెదవుల కన్నా - సాయం చేసే చేతులు మిన్న. ఈ వాక్యాన్ని ఆచరణలో పెడుతుంటుంది టాలీవుడ్. మన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు.. వీళ్లంతా.. వీలున్నప్పుడల్లా `సాయం` అందిస్తున్నా తమ ఉదారతని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా శేఖర్ కమ్ముల కూడా ఓ రైతుని ఆదుకున్నారు. `దటీజ్ శేఖర్ కమ్ముల` అనిపించుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య ఓ గుడెసెలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల గ్యాస్ లీకై తన ఇల్లు కాలిపోయింది. అయితే ఇంటితో పాటు.. తను దాచుకున్న రూ6 లక్షలు కూడా కాలి బూడిదయ్యాయి. ఆ డబ్బు సొంత ఇంటి కోసం దాచుకున్నవి. పొలం అమ్మి.. ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుందామనుకున్నాడు లక్ష్మయ్య. గుడిసె కాలిపోవడంతో.. తన కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఈ విషయం టీవీ ఛానల్స్ ద్వారా తెలుసుకున్న శేఖర్ కమ్ముల వెంటనే స్పందించారు. లక్ష రూపాయలను నేరుగా లక్ష్మయ్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. లక్ష్మయ్య కుటుంబంతో మాట్లాడారు. భవిష్యత్లో వారికి అండగా ఉంటానని శేఖర్ కమ్ముల ధైర్యం చెప్పారు. తమను ఆదుకున్న శేఖర్ కమ్ములకు లక్ష్మయ్య కుటుంబం ధన్యావాదాలు తెలిపింది.