మంచి కాఫీలాంటి సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ప్రస్తుతం అలాంటిదే మరో సినిమాను ఓ ఆసక్తికరమైన కాంబినేషన్లో తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 'లవ్ స్టోరి' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది కానీ కుదరలేదు. ఈ సినిమాను దసరా సీజన్ బరిలో నిలపాలని శేఖర్ కమ్ముల ఆలోచిస్తున్నారట. ఈ సినిమా పెండింగ్ షూట్, పోస్ట్ ప్రొడక్షన్ త్వరగానే పూర్తవుతుందని, ఆగష్టు నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని అంటున్నారు.
ఒకవేళ ఆగష్టు లోపల థియేటర్లు కనుక తెరిచిన పక్షంలో ఈ సినిమాను ఆగష్టులోనే రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే శేఖర్ కమ్ముల మాత్రం ఆగష్టు కంటే దసరా సీజన్ అయితే మేలని అంటున్నారట. పండగ సీజన్లో ఇలాంటి సినిమాలకు ఆదరణ ఎక్కువ ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారట. అప్పటికి ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లడానికి అలవాటు పడతారని కలెక్షన్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారట. థియేటర్లు రీ-ఓపెన్ చేసిన తర్వాత అన్నీ చూసుకుని రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. తన చివరి సినిమా 'ఫిదా' తో ప్రేక్షకులను ఫిదా చేసిన శేఖర్ కమ్ముల ఈసారి 'లవ్ స్టోరి' తో కూడా ఫిదా చేస్తారా అనేది వేచి చూడాలి