కొంతమంది దర్శకులుంటారు. వాళ్లు మోనార్క్‌లు. తాము తీసిందంతా తెరపై కనిపించాలని తహతహలాడుతుంటారు. తాము అనుకున్న ప్రతీ సీన్ పర్‌ఫెక్ట్ గా తెరపై రావాలని ఆరాటపడుతుంటారు. ఆ ప్రయాసలో సినిమా రన్ టైమ్ ఎక్కువైనా పెద్దగా ఆలోచించరు. శేఖర్ కమ్ముల ఈ జాబితాలో వచ్చే దర్శకుడే. తన సినిమాలన్నీ క్లాసీ టచ్ తో సాగుతాయి. సినిమా లెంగ్త్ విషయంలో శేఖర్ కమ్ముల పెద్దగా పట్టించుకోడు. అందుకే వెండి తెరపై సుదీర్ఘంగా సాగుతుంటాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్.. ఇవన్నీ లెంగ్తీ సినిమాలే. కొన్నిసార్లు ఆ లెంగ్తే సినిమాల్ని ముంచేస్తాయి. సినిమా బాగానేఉన్నట్టున్నా.. నిడివి ఎక్కువ అవ్వడం వల్ల బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది.
ఈరోజుల్లో సినిమా అంటే 2 గంటలే. మహా అయితే మరో 20 నిమిషాలు. రెండున్నర గంటల సినిమాలు బాగా తగ్గిపోయాయి. అయితే శేఖర్ కమ్ముల మాత్రం 2 గంటల 50 నిమిషాల సినిమా తీశాడు. తన దర్శకత్వంలో రూపొందిన `లవ్ స్టోరీ` నిడివి అంతే ఉంది. నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ఇది. ఈనెల 24న వస్తోంది. ఈ సినిమాకి పాజిటీవ్ బజ్ ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. అయితే సినిమా లెంగ్త్ తో ఏమైనా సమస్యలు వస్తాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. థియేటర్లలో అంత సేపు కూర్చునే ఓపిక ఈతరంకి ఉందా? అనిపిస్తుంది. అయితే సినిమా బాగుంటే రన్ టైమ్ పెద్ద ఇబ్బంది కాదని సినీ ప్రేమికులు చెబుతుంటారు. మరి లవ్ స్టోరీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.