మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా `జోసెఫ్`. తెలుగులో `శేఖర్` గా రీమేక్ చేశారు. ఈ సినిమాపై.. రాజశేఖర్ కుటుంబం చాలా ఆశలు పెట్టుకొంది. ఈ సినిమాని సొంతంగా నిర్మించింది. కుటుంబం అంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఓటీటీ ఆఫర్లు వచ్చినా... థియేటర్‌లో విడుదల చేయాలన్న ఆశతో... అవన్నీ తిరస్కరించింది. అయితే... థియేటర్ దగ్గర కూడా ఈ సినిమాకి ఎదురు దెబ్బ తగిలింది. తొలి రోజు కేవలం రూ.50 లక్షల షేర్ సాధించింది. ఈ సినిమాకి దాదాపు 9 కోట్ల ఖర్చయింది. అదంతా థియేటర్ నుంచి రాబట్టుకోవడం కష్టం.
ఓటీటీ, శాటిలైట్ రూపంలో కొంత తిరిగి వస్తే.. ఈ సినిమా గట్టెక్కుతుంది. అయితే.. కోర్టు వివాదాలు ఈ సినిమాని నిలువుగా ముంచేశాయి. `గరుడవేగ` సమయంలో చేసిన అప్పులు శేఖర్‌ని చుట్టుముట్టాయి. ఆదివారం ఈ సినిమా ప్రదర్శన నిలిపివేస్తూ కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. కోర్టు గొడవలు ఉండడంతో.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా అమ్మడం కష్టమే. `ఈ సినిమా ఆడకపోతే.. అమ్ముకోవడానికి నాకు ఆస్తులు కూడా లేవు` అని రాజశేఖర్ బహిరంగంగానే ప్రకటించారు. శేఖర్ నష్టాల నుంచి.. ఆ కుటుంబం ఎప్పుడు తేరుకుంటుందో?