జీవితా రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తై శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా '2 స్టేట్స్' సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. అడవిశేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. చాలా కాలం క్రితమే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే, ఈ మధ్య శివానీ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. స్వయానా ఈ సినిమా నిర్మాతే ఈ ప్రచారం చేయిస్తున్నారనేది ఓ వాదన. ఎం.ఎల్.వి సత్యనారాయణ ఈ సినిమాకి నిర్మాత.
వెంకటరెడ్డి దర్శకుడిగా పని చేస్తున్నారు. అయితే, దర్శకుడు ముందు అనుకున్న కథకి మధ్యలో చిన్నా, చితకా మార్పులు చేస్తున్నారనీ, అది నచ్చని నిర్మాత ఈ సినిమా నుండి ఆయన్ని తప్పించే క్రమంలో ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ విషయమై దర్శకుడు, నిర్మాతపై కేసు పెట్టాడట. త్వరలో ఆ కేసు విచారణకు రానుందట.
కేసు విచారణకు వచ్చేంతవరకూ సినిమాని తాత్కాలికంగా వాయిదా వేశారనీ తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు, నిర్మాణ భాగస్వామ్యం కూడా కలిగిన వెంకటరెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని ఆపేది లేదనీ, రీమేక్ రైట్స్‌లో తనకూ భాగం ఉందనీ అంటున్నారు. ఏమో చూడాలి మరి, శివానీ తొలి సినిమాకే ఇలాంటి కష్టాలు రావడమేంటో.