రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్'. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. హీరోగా రాజశేఖర్ 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది.
దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో... సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామం" అని చెప్పారు.