'నా పేరు శ్రద్ధాశ్రీనాధ్'.. యాద్ ఉంచుకోండి. అంటూ 'జెర్సీ' సినిమా ప్రమోషన్స్‌లో తెగ సందడి చేసిన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాధ్. ఆమె చెప్పినట్లుగానే సినిమా విడుదలయ్యాక ఆమెని ప్రశంసించని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. అంత చెప్పినా ఆ తర్వాత తెలుగులో ఇంకో అవకాశం దక్కించుకోలేదు. 'జెర్సీ'కి ముందే యంగ్‌స్టర్ ఆది సాయికుమార్‌తో 'జోడీ' సినిమాలో నటించింది.
త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే, తమిళంలో శ్రద్ధా శ్రీనాధ్ నటించిన 'నేర్కొండపార్వై' సినిమా ముచ్చట్లు శ్రద్ధా ఇప్పుడు ఆసక్తికరంగా చెబుతోంది. అజిత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధా నటించింది. హీరోయిన్గా కాదు కానీ, ఇంపార్టెంట్ రోల్ ఆమెది. ఈ పాత్ర ఔచిత్యం గురించి చెబుతూనే మరోసారి తనదైన స్టైల్లో సినిమాకి ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకు ఆడియన్స్ కోపం తెచ్చుకుంటారట.
ఒకానొక టైంలో ఆమె పర్ఫామెన్స్కి అసహ్యం తెచ్చుకుంటారట కూడా. అంతలాంటి పాత్రలో శ్రద్ధా నటించిందట. అసలింతకీ ఆమె పాత్రేంటీ.? కొంప తీసి విలన్‌గా ఏమైనా నటించేసిందా.? అనే అనుమానాలొస్తున్నాయి ఆమె మాటలు వింటుంటే. అయినా, తానసలే హీరోయిన్ని కాదు.. కేవలం నటిని మాత్రమే అని చెప్పుకునే శ్రద్ధాకి తనలోని నటిని ఛాలెంజ్ చేసే పాత్రగా ఈ సినిమాలోని పాత్రను అభివర్ణించాలేమో. వినోద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.