గతేడాది బాలయ్య వరుస చిత్రాలతో యంగ్ హీరోస్‌ని మించిన ఉత్సాహంతో దూసుకొచ్చారు. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' తో సెన్సేషనల్ హిట్ కొట్టిన బాలయ్య తర్వాత 'పైసా వసూల్'తో నిరాశ పరిచినా, సినిమాలు చేయడంలో జోరు తగ్గించలేదు. అదే జోరుతో చేసిన 'జై సింహా' ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. కానీ ఇది కూడా ఆశించిన రిజల్ట్ అందించలేదు. దాంతో కొంచెం గ్యాప్ తీసుకున్నారు బాలయ్య. వరుసగా రెండు సినిమాల్లో ముద్దుగుమ్మ శ్రియతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించారు.
ఎక్కువగా హీరోయిన్స్‌ని రిపీట్ చేస్తాడన్న ప్రచారం బాలయ్య బాబుకు ఎలాగూ ఉంది. అందులో భాగంగానే నయనతార, శ్రియ, రాధికా ఆప్టే ఇలా పలువురు ముద్దుగుమ్మల్ని మళ్లీ మళ్లీ తన సినిమాల కోసం రిపీట్ చేశాడు బాలయ్య. తాజాగా శ్రియను మరోసారి తన కొత్త సినిమా కోసం బాలయ్య ఎంచుకున్నారనీ తెలుస్తోంది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా బాలయ్య జోరుగా సినిమాలు చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. తొలి ప్రయత్నంగా మొదలెట్టిన 'ఎన్టీఆర్' బయోపిక్ అర్ధాంతరంగా అటకెక్కేసింది.
దాంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి, కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'చెన్న కేశవరెడ్డి'తో మంచి హిట్ అందించిన మెగా డైరెక్టర్ వినాయక్‌తో బాలయ్య సినిమాకి కమిట్ అయ్యారు. ఆ సినిమాకే హీరోయిన్‌గా శ్రియను ఎంచుకున్నట్లు తాజా సమాచారమ్. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న శ్రియ, పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ కానుందని ఈ కమిట్మెంట్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత శ్రియ ఓకే చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్.