గత కొంత కాలంగా నెపోటిజం అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఈ నెపోటిజం టాపిక్ పై చాలామంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నెపోటిజంను ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు ఫిల్మ్ మేకర్లు, స్టార్ హీరోలపై నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. దాని తాలూకు వేడి చాలామంది హీరో, హీరోయిన్లకు కూడా తగులుతోంది. ఈ మధ్య ఈ అంశంపై హీరోయిన్ శృతి హాసన్ స్పందించారు.
శృతిహాసన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె అనే సంగతి అందరికీ తెలిసిందే. శృతి అమ్మగారు సారిక కూడా ఒక ప్రముఖ నటి. స్టార్ కిడ్ గా సినీ రంగ ప్రవేశం చేసిన శృతికి నెపోటిజంపై స్పందించడం కష్టమే. అయితే ఏ విషయంపైనా ఓపెన్ గా మాట్లాడే శృతి ఈ అంశంపై కూడా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది. నెపోటిజం అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిదని చెప్పుకొచ్చింది. నాన్నగారి ఇంటిపేరు వల్ల తనకు మొదట్లో అవకాశాలు వచ్చిన మాట నిజమేనని, అయితే మొదటి రెండేళ్ల తర్వాత మాత్రం తన హార్డ్ వర్క్, టాలెంట్ తోనే అవకాశాలు సాధించానని తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బ్యాక్ గ్రౌండ్ అనేది ఉపయోగపడుతుంది కానీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు అది మాత్రమే చాలదని చెప్పింది.
ఏ విషయాన్ని అయినాా తనకు నెమ్మదిగా నేర్చుకునే అలవాటు ఉందని, దాని వల్ల కొంత ఇబ్బంది పడ్డానని కూడా తెలిపింది. ఓవరాల్ గా చూసుకుంటే సినీ పరిశ్రమలో తనది క్లిష్టమైన ప్రయాణమేనని చెప్పింది. శృతి సినిమాల విషయానికొస్తే త్వరలో 'యారా' అనే హిందీ సినిమా ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సినిమా కాకుండా తెలుగులో రవితేజ 'క్రాక్', తమిళంలో విజయ్ సేతుపతి 'లాబం' సినిమాల్లో నటిస్తోంది