ప్రముఖ నటులు, రచయిత శ్రీ రావి కొండల రావు గారు తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
తెలుగు చిత్రసీమకు శ్రీ కొండలరావు గారు అందించిన బహుముఖ సేవలు అజరామరం. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు. రచయితగా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, పాత్రికేయుడిగా సినీ జర్నలిజానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. సినీ రంగంలోని ఎన్నో మలుపులను అక్షరబద్ధం చేశారు. ఆరు దశబ్ధాలకు పైబడి.. తెలుగు సినీ రంగంతో ఆయన అనుబంధం కలిగి ఉన్నారు. విజయ సంస్థతోను, బాపు - రమణలతోను సన్నిహిత సంబంధాలు కలిగిన శ్రీ రావి కొండలరావు గారు నటుడిగా, సినీ కథా రచయితగా తన ముద్రను వేశారు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ‘పెళ్లి పుస్తకం’ చిత్రానికి కథా రచయితగా, అందరి ప్రశంసలతోపాటు పలు పురస్కారాలు కూడా అందుకున్నారు.
అన్నయ్య చిరంజీవి గారు చిత్రాలు మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయి లాంటి వాటిలో శ్రీ కొండలరావు గారు పోషించిన పాత్రలు అందరికీ గుర్తే. గత యేడాది ఒక పుస్తకావిష్కరణ సభలో వారిని కలిసినప్పుడు సినీ రంగ ప్రస్థానం, మలుపులు గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.