కథానాయికల ముఖ కవళికల్లో, గ్లామర్‌లో ఏమైనా మార్పులు కనిపిస్తే.. `ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకుందా` అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు జనాలు. `ఏ దేశంలో కథానాయికకు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది? అందుకోసం ఎంత ఖర్చు పెట్టింది` అంటూ కూపీలు లాగుతారు. చాలామంది కథానాయికలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని బయట పెట్టరు. కానీ.. శ్రుతిహాసన్ మాత్రం అలా కాదు. `నేను సర్జరీ చేయించుకున్నా. అయితే తప్పేంటి` అంటూ ధైర్యంగానే ప్రశ్నిస్తోంది.
వేళ్లకు నెయిల్ పాలీష్ చేయించుకోవడం, జుత్తుకు రంగు వేసుకోవడం ఎలానో.. ప్లాస్టిక్ సర్జరీ కూడా అలాంటిదే అంటోంది శ్రుతి. తన తొలి సినిమా సమయంలోనే ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట శ్రుతి. ''నా తొలి సినిమా సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. ముక్కు చిట్లింది. దాంతో మగరాయుడిలా కనిపించేదాన్ని. అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. అది నా అందాన్ని కాపాడగలిగింది. అందం గురించి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పేం కాదు. అది అమ్మాయిల హక్కు. దాన్ని నేరంగా నేను భావించను. ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు'' అంటూ తన ఆవేశాన్ని వెళ్లగక్కుతోంది శ్రుతి. ఈ విషయంలో మిగిలిన కథానాయికలు ఏమంటారో?