పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా.. వకీల్ సాబ్. ఈసినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి. వాటిని... అందుకోవడానికి చిత్రబృందం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. 100 గంటలైనా.. ఇప్పటికీ అదే ట్రెండింగ్ లో వుంది. అయితే ఈ సినిమా విషయంలో శ్రుతి హాసన్‌కి అన్యాయం జరిగినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
అయితే.. ఈ సినిమాలో తను హీరోయిన్ కాదట. కేవలం గెస్ట్ రోలేనట. ఈ విషయాన్ని శ్రుతి సైతం అంగీకరించింది. ``ఈ సినిమాలో నేను హీరోయిన్ ని కాదు. కేవలం అతిథిని మాత్రమే`` అని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. ఇందులో శ్రుతి కేవలం మూడంటే మూడు సన్నివేశాల్లో కనిపిస్తుందట. నిజానికి శ్రుతిది పెద్ద పాత్రే. 15నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తాను కనిపించాలి. అయితే లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. సినిమాని త్వరగా రెడీ చేయాలన్న ఉద్దేశంతో స్క్రిప్టులోని కొన్ని సన్నివేశాల్ని ముందే తొలగించారు. దాంతో.. శ్రుతి సన్నివేశాలన్నీ లేచిపోయాయి. త
న సన్నివేశాలకు బాగా కోత పడింది. అలా.. హీరోయిన్ కాస్త, అతిథి పాత్రకు షిఫ్ట్ అయిపోయింది. తన పారితోషికాన్నీ బాగా కుదించార్ట. ముందు అనుకున్న పారితోషికంలో సగం మాత్రమే ఇచ్చారని తెలుస్తోంది. అలా.. సన్నివేశాలూ లేచిపోయి, పారితోషికమూ తగ్గిపోయింది. కాకపోతే.. పవన్ కల్యాణ్ సినిమాలో నటించానన్న తృప్తి మాత్రం మిగిలిందంతే.