ముద్దుగుమ్మ శృతిహాసన్ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొంది, తర్వాత కొన్నాళ్లు ప్రేమ, పెళ్లి అంటూ తిరిగి, సినిమాలకు దూరంగా ఉంది. అయితే, ఇటీవల ఆమె తన లవర్ మైఖేల్ కోర్సెల్‌తో లవ్ బ్రేకప్ చేసుకుని, ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే తమిళంలో 'లాభం' అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. విజయ్ సేతుపతి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
దీంతో పాటు తెలుగులో కూడా ఓ ప్రాజెక్టుకు సైన్ చేసింది. వీటితో పాటు, చాలా అవకాశాలు శృతిని వెతుక్కుంటూ వస్తున్నాయట. తెలుగులో హీరోయిన్స్ కొరత తీరడమే లేదు. కొత్త భామలు ఎందరు వచ్చినా, ఒక్కొక్క సినిమాకే పరిమితమవుతున్నారు. అదే అవకాశం ఇప్పుడు శృతికి కలిసొచ్చేలా ఉంది. బిగ్ ప్రాజెక్టులు శృతికి చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే త్వరలో శృతిహాసన్ మళ్లీ తెలుగులోనూ బిజీ కానుందన్న మాట.
ఈ మధ్య బ్రేకప్ లవ్ స్టోరీలు హీరోయిన్స్‌ని కాస్త బాధించినా, కెరీర్ పరంగా కొంత లాభాన్నే చేకూరుస్తున్నాయనుకోవాలేమో. లవ్ కావచ్చు, పెళ్లి, కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు.. బ్రేకప్ చెప్పేసుకున్నాక, కెరీర్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు అందాల భామలు. ఆ కోవలో అమలాపాల్, త్రిష ఇప్పటికే కెరీర్లో ఎంత బిజీ అయిపోయారో తెలిసిన సంగతే. తాజాగా శృతిహాసన్ టైమొచ్చింది. మరి శృతి సంగతేంటో ఇంకా చూడాల్సి ఉంది.