కొలకొత్తా సెట్ అంటే `చూడాలని ఉంది` గుర్తొస్తుంది. ఆ సినిమాలో.. కొలకొత్తా సెట్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు నాని సినిమా `శ్యామ్ సింగరాయ్`కి సైతం కొలకొత్తా సెట్ వేయాల్సివస్తోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. కథ ప్రకారం కొలకొత్తాలో కొంత మేర షూట్ చేయాలి. ఇది వరకు కొలకొత్తాలో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారు కూడా.
ఇప్పుడు ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దుతోంది చిత్రబృందం. హైదరాబాద్ శివార్లలో పది ఎకరాల స్థలంలో.. రూ.6.5 కోట్ల వ్యయంతో ఈ సెట్ ని నిర్మిస్తున్నారు. ఓ కీలకమైన షెడ్యూల్ మొత్తం ఇదే సెట్ లో జరగబోతోంది. ఈ సన్నివేశాలు కథకు చాలా కీలకమని, అందుకే ఇంత భారీ స్థాయిలో సెట్ ని వేయాల్సివచ్చిందని చిత్రబృందం చెబుతోంది. సాయిపల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.