నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ తదితరులు
దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: నవీన్ నూలి
రేటింగ్: 3/5
నాని నుంచి సినిమా వస్తుందంటే బావుంటుందనే నమ్మకం. నానికి సక్సెస్ రేటు అలాంటింది. ఇప్పుడు నాని నుంచి మరో సినిమా వచ్చింది. టైటిల్ పెట్టిన దగ్గరనుంచే ఆసక్తిని పెంచింది ‘శ్యామ్ సింగరాయ్'. టాక్సీవాలా లాంటి డిఫరెంట్ జోనర్ సినిమా తీసిన రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు కావడం ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్. ట్రైలర్ విడుదలైన తర్వాత ‘శ్యామ్ సింగరాయ్ ఇంకా ఆసక్తిని పెరిగింది. గత జన్మల కథ, నాని డబుల్ యాక్షన్, దేవదాసిగా సాయిపల్లవి, ఛార్మింగ్ బ్యూటీ కృతి శెట్టి.. సినిమాపై అంచనాలు పెంచారు. మరి ఇంత ఆసక్తిని రేపిన 'శ్యామ్ సింగరాయ్' కథలోకి వెళితే...
కథ:
వాసు ( నాని) సినిమా డైరెక్షన్ ప్రయత్నాల్లో ఉంటాడు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసి తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటాడు. షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా కీర్తి ( కృతి శెట్టి) ని సెలక్ట్ చేస్తాడు. షార్ట్ ఫిల్మ్ కి మంచి పేరు వచ్చి వాసుకి సినిమా అవకాశం వస్తుంది. ఆ సినిమాని కూడా సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో ఆ సినిమాని హిందీలో రిమేక్ చేసే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడే వాసుకి ఓ లీగల్ సమస్య ఎదురౌతుంది. వాసు తీసిన ఫిల్మ్ 1970లో ప్రచురితమైన కథ నుంచి కాపీ కొట్టారనిని పబ్లిషర్ కేసు వేస్తాడు.
కేసు కోర్టుకు వెళుతుంది. కథ తన ఒరిజినల్ ని అని వాదిస్తాడు వాసు. కానీ విచారణలో బాగంగా క్లినికల్ హిప్నాసిస్ చేసే క్రమంలో వాసు గత జన్మ వెలుగులోకి వస్తుంది. అసలు వాసు ఎవరు ? తన తీసిన కథకి గతంలోని ‘శ్యామ్ సింగరాయ్' మధ్య వున్న సంబంధం ఏమిటి ? మైత్రి సాయి పల్లవి) ఎవరు ? శ్యామ్- మైత్రిల ప్రేమ కథ ఏమిటి ? అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ:
దర్శకుడు రాహుల్ కొత్త కాన్సెప్ట్ ని సినిమాగా చెప్పే టెక్నిక్ ని చక్కగా పట్టుకున్నాడు. టాక్సీవాలాలో ఒక ఆత్మ కార్ లో వుండిపొతే.. అనే ఐడియాని 'అస్త్రాల్ ప్రొజెక్షన్' అనే కాన్సెప్ట్ తో జస్టిఫీకేషన్ చేసి.. కామెడీ డ్రామా అందించాడు. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ లో కూడా తన టచ్ చూపించాడు. ఒక వ్యక్తి సంబధించి రెండు జన్మలని ఒక్కటిగా చేసి హ్యూమన్ బ్రెయిన్ సబ్ కాన్సియస్, క్లినికల్ హిప్నాసిస్ లాంటి మెడికల్ కాన్సెప్ట్స్ లని వాడుకొని ప్రేక్షకులని మెప్పించే సినిమాగా శ్యామ్ సింగరాయ్ ని తీర్చిదిద్దడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు.
సినిమా మొదటి సగంలో అసలు కధలోకి వెళ్ళకుండా మెయిన్ కథ మొత్తాన్ని రెండోసగానికి దాచేశాడు దర్శకుడు, ఇది ఒకవిధంగా మంచికే జరిగింది. ఇంటర్వెల్ తర్వాత ఏమిటనేదే ఈ సినిమా బలం. ఆ పాయింట్ ని బలంగానే వాడుకున్నాడు. వాసు డైరెక్షన్ ట్రైల్స్, కృతి శెట్టి తో కెమిస్ట్రీ, పాటలు, లైటర్ వెయిన్ వినోదంతో మొదటిసగం హాయిగానే గడిచిపోతుంది. రెండో సగం ఈ చిత్రానికి ఆయుపట్టు. శ్యామ్ సింగ రాయ్ కధని చక్కటి దృశ్యంగా మలిచాడు దర్శకుడు.
విప్లవ కవిత్వం, సంఘసంస్కరణలు నేపధ్యంలో వచ్చే సీన్స్ కొన్ని ఆకట్టుకుంటాయి. దేవదాసి అయిన మైత్రేయి ప్రేమలో పడటం తర్వాత వచ్చిన సీన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నాని- సాయిపల్లవిలా కెమిస్ట్రీ కధని మరో స్థాయికి తీసుకువెళుతుంది. ప్రణయవేళ, నెల రాజుని ఇల రాణి .. పాటల చిత్రీకరణ అద్భుతంగా కుదిరింది. చివర్లో వచ్చిన ఎమోషన్స్ చక్కగా పండాయి. అయితే ఈ ప్రేమని ఫీల్ అవ్వడానికి కొంచెం సహనం కావాలి. చాల చోట్ల నేమ్మదిగే సాగే కధనం వుంటుంది. చివర్లో వచ్చిన ఒక మలపు థ్రిల్లింగా ఉన్నప్పటికీ అప్పటికే నెమ్మదిగా సాగిన కధనం .. కొంత నిరాశ పరుస్తుంది. ఫాస్ట్ అండ్ రేసి స్క్రీన్ ప్లే ని ఇష్టపడే ప్రేక్షకులకు శ్యామ్ సింగరాయ్ ఎంత వరకూ నచ్చుతుందో మాత్రం ప్రశ్నార్ధకమే.
నటీనటులు :
నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేచురల్ స్టార్ నాని. ఇందులో డబుల్ యాక్షన్ ని కూడా అంతే నేచురల్ గా చేశాడు. వాసు పాత్ర, శ్యామ్ పాత్రలని చాలా పరిణితితో పోషించాడు. కలకత్తా నేపధ్యంలో వచ్చిన సీన్స్ లో నాని నటన చాలా కొత్తగా వుంటుంది. చాలా బరువైన పాత్ర శ్యామ్ రాయ్. ఆ పాత్రని తన అనుభవంతో చాలా సహజంగా చేసి మెప్పించాడు. సాయి పల్లవి నటన నెక్స్ట్ లెవెల్. దేవదాసీ పాత్రలో వచ్చిన సీన్స్, ఆమె నృత్యాలు, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. కృతి శెట్టి అందంగా కనిపించింది. మడోనా పాత్ర కూడా పరిధి మేరకు వుంది. మిగతా నటులు పాత్రలు మేరకు చేశారు.
టెక్నికల్:
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. కెమరా పనితనం బావుంది. విజువల్ రిచ్ గా వున్నాయి. ఆర్ట్ వర్క్ బావుంది. కలకత్తా నేపధ్యంలో వచ్చిన సీన్స్ చాలా సహజంగా వున్నాయి. పాటలన్నీ చూడడానికి బావున్నాయి. నేపధ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
ప్లస్ పాయింట్స్
నాని, సాయి పల్లవి, కృతి శెట్టి
కొత్త నేపధ్యం వున్న కథ
ఆకట్టుకున్న ఎమోషన్స్
పాటలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగిన కధనం
కొన్ని చోట్ల సాగదీత
ఫైనల్ వర్దిక్ట్ : శ్యామ్ రాయల్ లవ్ స్టొరీ