విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 'సింధూబాద్' చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకు కారణం బాహుబలి నిర్మాతలు. అదేంటీ.. తమిళ సినిమాకీ, బాహుబలి నిర్మాతలకూ ఏం సంబంధం అనుకుంటున్నారా.? అక్కడికే వచ్చేస్తున్నాం. బాహుబలి సినిమాని తమిళంలో ప్రముఖ నిర్మాత రాజరాజన్ విడుదల చేశారు. ఆ సినిమా తెలుగులోనూ కాదు, తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది.
అయితే, ఇప్పటి వరకూ తమకు రావల్సిన అమౌంట్‌ని రాజరాజన్ తిరిగివ్వలేదనీ 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రాజరాజన్ నిర్మించిన 'సింధూబాద్' సినిమా విడుదలపై ఆయన కేసు వేశారు. ఈ సినిమాతో పాటు, రాజరాజన్ నిర్మాణంలో రూపొందిన మరో సినిమా 'ఎన్నై నోకి పాయుమ్ తోటా' అనే సినిమా పైనా ఆయన కేసు వేశారు. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ కోర్టు ఈ రెండు సినిమాల విడుదల పైనా తాత్కాలిక స్టే విధించింది.
కానీ, రాజరాజన్ తన సహనిర్మాతలతో కలిసి 'సింధూబాద్' విడుదల చేసేందుకు ప్రయత్నించగా అక్కడా చుక్కెదురైంది ఈ నిర్మాతకి. ధియేటర్ యజమానులు అందుకు ఒప్పుకోలేదు. సినిమా విడుదలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ నుండి సర్టిఫికెట్ తీసుకొస్తేనే స్క్రీనింగ్ వేస్తామని వారు చెప్పారు. దాంతో విజయ్ సేతుపతి సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది.