ప్రభాస్ - నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొణెని కథానాయికగా ఎంచుకున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఈ స్క్రిప్టు పనుల్లో దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా పాలుపంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు సింగీతం పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. తమ టీమ్ లో సింగీతం ఉన్నారంటూ.. వైజయంతీ మూవీస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రభాస్ కోసం నాగ అశ్విన్ ఓ సైన్స్ ఫిక్షన్ కథని రెడీ చేశాడు. ఇలాంటి కథల్ని తెరకెక్కించడంలో సింగీతం దిట్ట. `ఆదిత్య 369` సైన్స్ ఫిక్షన్ స్టోరీనే. ఇప్పటికీ ఆ సినిమా కొత్తగానే ఉంటుంది. అందుకే... ఈ కథని అల్లడంలోనూ, స్క్రీన్ ప్లే రాసుకోవడం లోనూ సింగీతం సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది చిత్రబృందం. నాగ అశ్విన్ తీసిన మహానటి స్క్రిప్టులోనూ.. సింగీతం పాలు పంచుకున్నారు. ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని నాగ అశ్విన్ ఫాలో అయ్యాడన్నమాట.