ఆమె పెళ్ళి చేసుకుంది.. అయితే, ఆమెకు ఇది రెండో పెళ్ళి. పైగా, ఎదిగిన పిల్లలూ వున్నారు. అయితే మాత్రం, ఆమె పెళ్ళి చేసుకోకూడదని ఎలా అనగలం. అది ఆమె వ్యక్తిగతం. తన ఒంటరి జీవితానికి తోడు కావాలనుకున్నారామె. కానీ, ఆమెపై కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అభినందించేవాళ్ళు ఎలాగైతే వున్నారో.. ఆమెను విమర్శిస్తున్నవారూ అలాగే వున్నారు. తనను అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు తనకుండడం, తన పిల్లలూ తన గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం తనకు చాలా ఆనందంగా వుందని అంటున్నారు సునీత.
ట్రోల్స్ గురించి పట్టించుకోవడం సునీత ఎప్పుడో మానేశారు. ఎందుకంటే, సినీ పరిశ్రమలో ఏ సింగర్ కూడా ఎదుర్కోనంత స్థాయిలో విమర్శలు ఆమె ఎదుర్కొన్నారు.. ఆమె చుట్టూ చాలా చాలా గాసిప్స వస్తూ వుండేవి.. బహుశా ఆ స్థాయి స్టార్‌డమ్ ఆమెకు వుందనడం అతిశయోక్తి కాదేమో. కరోనా నేపథ్యంలో బంధువులు, స్నేహితులందర్నీ పెళ్ళి వేడుకలో కలుసుకునే అవకాశం రాలేదనీ, తమకున్న స్నేహితులు, బంధువుల్లో చాలా తక్కువ మందితోనే వివాహ మహోత్సవం జరిగిందనీ, త్వరలోనే అందర్నీ కలుస్తామనీ చెప్పిన సునీత, ఆ తర్వాతే హనీమూన్‌కి వెళతామన్నారు.
ఇక్కడ హనీమూన్ వ్యవహారం ఇంకోసారి విమర్శలకు తావిచ్చింది. అయితే, అది ఆమె వ్యక్తిగతం. ప్రేమకీ, పెళ్ళికీ వయసు అడ్డంకి కానే కాదు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్ట నష్టాల్ని చవిచూసిన సునీత, ఇప్పుడు జీవితాన్ని ఆస్వాదించాలనుకోవడాన్ని ఎలా తప్పు పట్టగలం.?