పాటకు జాతిని మేల్కొలిపే శక్తి ఉంటుంది. ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఏనాడు అభ్యంతరకర పదాల్ని వాడలేదు. 'రాయే', 'పోయే', 'గుంట'.. తదితర దిక్కుమాలిన పదాలు తెలుగు పాటలో సర్వసాధారణమైపోయాయి. అయినా కానీ తనదైన ప్రత్యేకతను సిరివెన్నెల ఏనాడూ పక్కన పెట్టలేదు.
సిరివెన్నెల పాట అంటే అందులో చక్కని పదాలు, అర్ధవంతమైన భావం, అన్నింటికీ మించి ఆలోచింపచేసే సాహిత్యం ఉంటాయి. అందుకే సిరివెన్నెలను తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ప్రత్యేకంగా గౌరవిస్తారు. తన గౌరవం ఎప్పుడూ చెడిపోకుండా ఉండేందుకు నిత్య విద్యార్ధిలా మంచి మంచి పాటల్ని రచిస్తూనే ఉన్నారు సిరివెన్నెల.
సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెలను భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ' వరించిందంటే అది వ్యక్తిగతంగా ఆయనకే కాదు, తెలుగు పాటకు లభించిన అరుదైన గౌరవంగా భావించాలి. అదే సమయంలో పద్మ పురస్కారం తాలూకు గౌరవం రెట్టింపైందని భావిస్తే అది అతిశయోక్తి ఎంత మాత్రమూ కాబోదు. కృష్ణవంశీ, క్రిష్.. ఇలా కొంతమంది దర్శకులు సిరివెన్నెల పాట చుట్టూ కథలల్లుకుంటారు. అదీ సిరివెన్నెల ప్రత్యేకత.