తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించే మేటి సినిమాల్లో `మహానటి` ఒకటి. అదో క్లాసిక్. క్యారెక్టరైజేషన్ నుంచి విజువల్స్ వరకూ, పాటల నుంచి మాటల వరకూ అన్ని విషయాల్లోనూ చెక్కిన శిల్పంలా ఉంటుంది మహానటి. అందుకే ఆ సినిమాకి బోలెడన్ని అవార్డులు వచ్చాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలూ దక్కాయి. బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిసింది. మహానటి తరవాత ఆ స్థాయి ఉన్న సినిమాగా `సీతారామం`ని ప్రశంసిస్తున్నారంతా. దానికీ చాలా కారణాలున్నాయి
మహానటి లానే..సీతారామం ఓ క్లాస్ మూవీ. ఓ కథని దర్శకుడు తాను నమ్మింది నమ్మినట్టు తీస్తే - ఆ దర్శకుడికి నిర్మాణ సంస్థ అన్ని రకాలుగా సహకరిస్తే, నటీనటులు - సాంకేతిక నిపుణులు అంతా ప్రాణం పెట్టి పని చేస్తే ఎలా ఉంటుందో మహానటి చూపించింది. ఇప్పుడు సీతారామం కూడా అదే స్థాయిలో ఉందన్నది విశ్లేషకులు, విమర్శకుల మాట. కథా పరంగా, మేకింగ్ పరంగా, విజువల్స్ పరంగా.. అన్నింట్లోనూ హను రాఘవపూడి ఓ క్లాస్ ముద్రని ఈ సినిమాపై వేశాడు.
ఓ ప్రేమకథని ఎక్కడా అశ్లీలత, అసభ్యత లేకుండా క్లీన్ గా తెరకెక్కించిన విధానం కుటుంబ ప్రేక్షకుల్ని మంత్ర ముగ్థుల్ని చేస్తోంది. సినిమా అంతా ఆహ్లాదభరితమైన ప్రయాణంలా సాగిందని, పతాక సన్నివేశాల్లో కళ్లు చెమర్చాయని చూసినవాళ్లంతా కితాబులు ఇస్తున్నారు. మహానటిలానే ఈసినిమాకీ అవార్డులు - రివార్డులూ ఖాయమని జోస్యం చెబుతున్నారు. మహానటితో ఈ సినిమాని పోల్చడానికి రెండు బలమైన కారణాలున్నాయి. ఒకటి... దుల్కర్ సల్మాన్ తెలుగులో చేసిన తొలి సినిమా అదే. ఆ తరవాత...దుల్కర్ నటించింది సీతారామంలో మాత్రమే. మహానటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన వైజయంతీ మూవీస్ సంస్థలోనే ఇప్పుడు సీతారామం కూడా రూపుదిద్దుకుంది. అందుకే ఈ రెండు సినిమాల్నీ పోల్చి చూస్తున్నారు సినీ అభిమానులు. ఏదేమైనా మహానటిలానే, సీతారామం కూడా తెలుగు సినీ చరిత్రలో తనదైన స్థానాన్నీ, స్థాయినీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది